రైతు డిస్కమ్ కు 46 వేల కోట్ల అప్పు.. రూ.46,155 కోట్ల విద్యుత్ బకాయిలూ బదలాయింపు 

రైతు డిస్కమ్ కు 46 వేల కోట్ల అప్పు.. రూ.46,155 కోట్ల విద్యుత్ బకాయిలూ బదలాయింపు 
  • డిస్కమ్ ​ల మధ్య ఆస్తులు, అప్పులు, బకాయిల పంపిణీ పూర్తి
  • రైతు డిస్కమ్​​ వాటాగా రూ.3,162 కోట్ల ఆస్తులు 
  • 30.62 లక్షల విద్యుత్​ కనెక్షన్లు, 2 వేల మంది ఉద్యోగుల కేటాయింపు
  • ఆర్​పీడీసీఎల్​ను మూడో డిస్కమ్​గా ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మూడో విద్యుత్​ పంపిణీ సంస్థగా ‘తెలంగాణ రైతు పవర్​ డిస్ట్రిబ్యూషన్​ కంపెనీ లిమిటెడ్​(రైతు డిస్కమ్​)ను ఏర్పాటు చేస్తూ సోమవారం  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న రెండు డిస్కమ్​లతో పాటు కొత్తగా ఏర్పడిన  రైతు డిస్కమ్​ మధ్య ఆస్తులు, అప్పులు విభజిస్తూ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​సోమవారం జీవో నెంబర్​ 17 విడుదల చేశారు. విద్యుత్​ పంపిణీ సంస్థలకు రూ.62 వేల కోట్ల​వర్కింగ్​క్యాపిటల్​లోన్స్ ఉంటే అందులో రూ.46 వేల కోట్ల అప్పులను రైతు డిస్కమ్​కు బదలాయించారు.  

రూ. 46,155.28 కోట్ల విద్యుత్ బకాయిలూ ఆర్​పీడీసీఎల్​ఖాతాలో వేశారు. ఇందులో లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​లు, మిషన్​ భగరీథ, హైదరాబాద్​ జలమండలి తదితర ప్రభుత్వ సంస్థల నుంచి డిస్కమ్​లకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. అదే సమయంలో రైతు డిస్కమ్​కు కేవలం రూ.3,162 కోట్ల ఆస్తులు మాత్రమే బదలాయించడం గమనార్హం.  30.62 లక్షల విద్యుత్​ కనెక్షన్లు,  2 వేల మంది ఉద్యోగులను కేటాయించారు. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 131 పరిధిలో ఈ బదిలీ ప్రక్రియను చేపట్టినట్లు జీవోలో స్పష్టంచేశారు. 

ఐదు రకాల విద్యుత్​ కనెక్షన్లు బదిలీ

రైతు డిస్కమ్​ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్​ 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​ (టీజీ ఈఆర్​సీ) ఈ ఏడాది జూలై 10న రైతు డిస్కమ్​కు లైసెన్స్​ జారీ చేసింది. ఈఆర్​సీ సూచన మేరకు ప్రభుత్వం చీఫ్​ సెక్రటరీ సంజయ్​ జాజు అధ్యక్షతన హై లెవల్​ కమిటీ ఏర్పాటు చేసి డిస్కమ్​ల మధ్య ఆస్తులు, అప్పులు పంపిణీ చేశారు.  కొత్తగా ఏర్పడిన రైతు డిస్కమ్​కు ప్రభుత్వం ఐదు రకాల విద్యుత్​ కనెక్షన్లను బదిలీ చేశారు.

ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉచిత విద్యుత్​ కనెక్షన్లే కావడం గమనార్హం. ఇందులో వ్యవసాయ విద్యుత్​, లిఫ్ట్​ ఇరిగేషన్​(ఎల్​ఐఎస్​), హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ వాటర్​ సప్లై, మిషన్​ భగీరథ కనెక్షన్లతో పాటు ఎల్​టీ 6–బీ పరిధిలోని డీటీఆర్​ల కింద మొత్తం 30.62 లక్షల విద్యుత్​ కనెక్షన్లు ఉన్నాయి. అందులోనూ అత్యధికంగా వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్లే. ఈ విద్యుత్​ కనెక్షన్ల కేటగిరీలకు విద్యుత్ సరఫరా, బిల్లింగ్, వినియోగదారుల సమస్యల పరిష్కార బాధ్యతలను ఇక నుంచి రైతు డిస్కమ్​ చూసుకోనుంది. రైతు డిస్కమ్​ పరిధిలోకి వచ్చే వినియోగదారుల అవసరాల కోసం పాత డిస్కమ్‌‌‌‌ల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లను కేటాయించారు.

రూ.3,162 కోట్ల ఆస్తులు

సదరన్​, నార్తర్న్​ డిస్కమ్​ల మధ్య ఇదివరకు ఉన్న నెట్​వర్క్​ ఆస్తులను ప్రభుత్వం విభజించింది. మొత్తం రూ.3,162 కోట్ల విలువ చేసే అస్తులను రైతు డిస్కమ్​కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కోన్నది. వీటిలో రూ. 2,123.46 కోట్ల విలువ గల 6,15,651 వ్యవసాయ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, రూ. 1,039 కోట్ల విలువ గల 2,51,213 సర్క్యూట్ కి. మీ పొడవైన ఎల్టీ లైన్లు ఉన్నాయి.